DNB News - తెలంగాణ / : పెట్రోల్, డీజిల్ కొరత లేదని, వాహనదారులు ఆందోళన చెంది అవసరానికి మించి కొనుగోలు చేయవద్దని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ స్పష్టం చేశారు. సోమవారం స్థానిక భూపాల్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న నారాయణమూర్తి పెట్రోల్ బంక్, అమ్మ హాస్పిటల్ సమీపంలోని రిలయన్స్ పెట్రోల్ బంక్, గుత్తి పెట్రోల్ బంక్‌లను కలెక్టర్, ఎస్పీలు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 166 పెట్రోల్ బంకులు ఉన్నాయని తెలిపారు. ప్రతి బంక్ వద్ద వీఆర్‌ఓలు పర్యవేక్షణ నిర్వహిస్తూ పెట్రోల్ లోడ్ వివరాలను నమోదు చేస్తున్నారని చెప్పారు. క్యాన్లు, డబ్బాలు, బ్యారెల్స్‌తో వచ్చి పెట్రోల్ తీసుకెళ్లకుండా షాపు యాజమాన్యాలకు ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. గత మూడు రోజులుగా జనసందోహం తగ్గుముఖం పట్టిందని, ఇప్పటివరకు 15 కేసులు నమోదు చేసి 150 లీటర్ల డీజిల్, 200 లీటర్ల పెట్రోల్ సీజ్ చేసినట్లు తెలిపారు. HPCL తదితర ఆయిల్ కంపెనీలతో చర్చించి సాయంత్రానికి 95–100 లోడ్లు అందుబాటులోకి వస్తాయని, దీంతో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందని చెప్పారు. అనంతరం వాహనదారులతో మాట్లాడిన కలెక్టర్, ఎటువంటి కొరత లేదని, అపోహలకు లోనవకుండా అవసరానికి సరిపడేంత మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని కోరారు. జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ పెట్రోల్ బంక్‌ల వద్ద క్యూలను నియంత్రించేందుకు ఇప్పటికే తగిన పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఓ రాజా రఘువీర్, సివిల్ సప్లైస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News