DNB News - తెలంగాణ / : మంత్రి లోకేష్‌ను కలిసిన ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ బచ్చు కృష్ణ కుమార్ దంపతులు బోగోలు మండల ప్రభుత్వ పాఠశాలలకు రూ.5 కోట్ల సాయం ప్రకటించిన ట్రస్ట్ ఉండవల్లి: పేదల సాధికారతకు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పీ-4 కార్యక్రమానికి నెల్లూరు జిల్లా బోగోలు మండలానికి చెందిన అమరా బచ్చు ఛారిటబుల్ ట్రస్ట్ చేయూత అందించనుంది. ఉండవల్లిలోని తన నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ బచ్చు కృష్ణ కుమార్ దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బోగోలు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.5 కోట్ల సాయం ప్రకటించారు. త్వరలో చేపట్టనున్న అభివృద్ధి పనుల శంకుస్థాపనకు రావాలని మంత్రిని ఆహ్వానించారు. పీ-4 కార్యక్రమంలో భాగంగా ‘మన బడి–మన భవిష్యత్’ కింద బోగోలు మండలంలోని పలు ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులను మెరుగుపరచనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో ప్రవాస భారతీయులు, పూర్వ విద్యార్థులను భాగస్వామ్యం చేయడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. దాతల పేర్లను కూడా ఆయా పాఠశాలలకు పెట్టుకునే అవకాశం కల్పించనుంది. త్వరలోనే ‘మన బడి–మన భవిష్యత్’ వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించనున్నారు. ఇక బోగోలు మండలం కొవ్వూరుపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి రూ.5 కోట్లు, కొండ బిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి మరో రూ.5 కోట్ల సాయాన్ని అమరా బచ్చు ఛారిటబుల్ ట్రస్ట్ అందించనుంది.
Admin
DNB News