DNB News - తెలంగాణ / : ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ఇంటర్మీడియట్ విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సదాశివపురం గ్రామానికి చెందిన ఎండ్రాతి విశాల్, జిల్లపల్లి జస్వంత్, కొంగర గ్రామానికి చెందిన పొట్ట ఆకాష్ నేలకొండపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఇంటర్ పరీక్షల నేపథ్యంలో వీరు సింగారెడ్డిపాలెంలోని గురుకుల పాఠశాల పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసి బైక్‌పై నేలకొండపల్లికి తిరిగి వస్తున్నారు. ఇదే సమయంలో కోరట్లగూడెం గ్రామానికి చెందిన బచ్చలకూరి అభినవ్ (జానీ), అమ్మగూడెం గ్రామానికి చెందిన వాసంశెట్టి ఉదరు, ఆరెగూడెం గ్రామానికి చెందిన బోయిన ఉదరు అనే ముగ్గురు విద్యార్థులు నేలకొండపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాసి తమ స్వగ్రామాలకు బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో సింగారెడ్డిపాలెం కొరటేనే గుట్ట మూలమలుపు వద్దకు చేరుకునే సరికి కూసుమంచి వైపు నుంచి వస్తున్న కారును తప్పించబోయి ఒక బైక్ నియంత్రణ కోల్పోయింది. దీంతో ఎదురుగా వస్తున్న మరో బైక్‌ను ఢీకొట్టడంతో రెండు బైకులపై ఉన్న ఆరుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో గాయపడిన విద్యార్థులను సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మండల వైద్యాధికారి డాక్టర్ రాజేష్ ఆధ్వర్యంలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఒకే ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు గాయపడటంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక ఎస్‌ఐ పి. సంతోష్, తహసీల్దార్ వి. వెంకటేశ్వర్లు, ఎంపీడీవో ఎం. ఎర్రయ్య తమ సిబ్బందితో కలిసి ఆస్పత్రిని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Admin
DNB News