DNB News - తెలంగాణ / : ప్రజాస్ఫూర్తి, కొత్తగూడెం: రక్తదానం చేయడానికి యువత పెద్ద సంఖ్యలో ముందుకు రావాలని కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ పిలుపునిచ్చారు. తద్వారా ప్రమాదంలో ఉన్న వారికి సకాలంలో రక్తం అంది ప్రాణాలు దక్కుతాయని చెప్పారు. యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు జె. బాలు ఆధ్వర్యంలో బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోగల కొత్తగూడెం ఏరియా హాస్పిటల్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని డీఎస్పీ ఆదినారాయణ ప్రారంభించి మాట్లాడారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ సమాజ హితానికి పాటుపడాలని సూచించారు. రక్తదానం చేయడం ద్వారా మరొకరి ప్రాణాలను కాపాడవచ్చునని, ప్రతీ ఒక్క వ్యక్తి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చునన్నారు. క్లబ్ వ్యవస్థాపకులు జె.బాలు మాట్లాడుతూ ప్రతీ ఇంటి నుండి ఒక్క రక్తదాత ఉండేలా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఎప్పుడు ఎవరికి ఏ గ్రూపు రక్తం అవసరం వచ్చినా తమను సంప్రదించవచ్చునని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం దొరకకుండా ఎవరూ చనిపోకూడదనేది తమ క్లబ్ ముఖ్య ఉద్దేశ్యమని వివరించారు. కేవలం అవసరమైన సమయంలో రక్త దాతల నుండి రక్తం అడగడమే కాకుండా స్వయంగా ప్రతి ఒక్కరు రక్తదాతలు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వాస్పత్రుల్లో రక్తదానం చేయాలని, తద్వారా ఆస్పత్రుల్లో ఆయా గ్రూపుల రక్తం నిల్వలు ఉండి అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుతాయని అన్నారు. ఇప్పటివరకు తమ క్లబ్ ద్వారా 46,500 మంది బాధితులకు రక్తదానం చేసినట్లు తెలిపారు. అసిస్టెంట్ మోటారు వెహికిల్ ఇన్‌స్పెక్టర్ సంగం వెంకటపుల్లయ్య మాట్లాడుతూ వాహనదారులు రక్షణ చర్యలు పాటించడం ద్వారా ప్రమాదాలు జరిగిన సందర్భంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చునని, వాహనదారులు హెల్మెట్, సీట్‌బెల్టు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. దాతలు చేసే రక్తదానం ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రాణాలను కాపాడుతుందన్నారు. ఈ శిబిరంలో 37 మంది రక్తదానం చేసినట్లు బాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో సి.ఐ. ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ ప్రవీణ్ రెడ్డి, వీరునాయక్, భరత్, రాజేష్, జుబ్బు, జయశ్రీ, కమలారాణి తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News