DNB News - తెలంగాణ / : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకాన్ని వేగవంతం చేయడానికి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో సహకరించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాదు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలాల వారీగా ఇప్పటికే అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులకు (ఏఈఆర్ఓలు), బూత్ లెవెల్ అధికారులకు బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకంపై సమావేశాలు నిర్వహించినందున, ఎస్‌ఐఆర్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి రాజకీయ పార్టీల ప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు. ఇంకా సమావేశాలు జరగని ప్రాంతాల్లో వెంటనే సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బూత్ లెవెల్ అధికారులు సంబంధిత యాప్‌పై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని, ఓటరు వివరాల మ్యాపింగ్ ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు . ఐడీఓసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతి ఇప్పటికే 61.25 శాతానికి చేరుకుందని తెలిపారు. మిగిలిన పనులను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయడానికి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, ప్రతి మండలంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమన్వయం పెంచి బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా, ఖచ్చితత్వంతో సాగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఎన్నికల సూపరింటెండెంట్ రంగ ప్రసాద్, సిబ్బంది నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News